ఆసియా బాక్సింగ్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

  • విశ్వనాథ్ సురేశ్, గంగా గోల్డ్ మెడల్స్..
  • ఐదు రజతాలతో ముగిసిన భారత ప్రచారం

జకార్తా, ఆంధ్రప్రభ : ఆసియా అండర్-19, అండర్-23 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు సాధించి టోర్నీని ఘనంగా ముగించింది.

అండర్-23 విభాగంలో 50 కేజీల విభాగంలో ప్రస్తుత సీనియర్ ఆసియా ఛాంపియన్ విశ్వనాథ్ సురేశ్ జపాన్‌కు చెందిన డైచి ఇవాయ్‌పై 3-2 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 55 కేజీల విభాగంలో గంగా కూడా కజకిస్థాన్ బాక్సర్ బెక్సులాతన్ బొరాన్‌బెక్‌పై 3-2తో గెలిచి బంగారు పతకం అందుకున్నాడు. 65 కేజీల విభాగంలో వంశజ్ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఇల్ఖోమ్‌జోన్ ఎర్గషెవ్ చేతిలో 1-4 తేడాతో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

అండర్-19 పురుషుల ఫైనల్స్‌లో భారత బాక్సర్లు పోరాడినా స్వర్ణాన్ని అందుకోలేకపోయారు. 55 కేజీల విభాగంలో ఆదిత్య ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఎల్యోర్ రుస్తమోవ్ చేతిలో 0-5తో ఓడగా, 90 కేజీల విభాగంలో శుభమ్ రాజ్‌పుత్ అసద్‌బెక్ సుల్తాన్‌బోయేవ్ చేతిలో 0-5తో పరాజయం పాలై ఇద్దరూ రజత పతకాలు సాధించారు.

ఇప్పటికే మహిళల విభాగంలో భారత్ 3 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించగా, పురుషుల విభాగంలో చివరి రోజు 2 స్వర్ణాలు, 3 రజతాలు జోడించడంతో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఆకట్టుకునే ప్రదర్శనతో టోర్నీని ముగించారు.