రైతు–మత్స్యకార సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు–మత్స్యకార సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • పాడి పశువుల నుంచి చెరువుల వరకు సమగ్ర అభివృద్ధికి చర్యలు
  • రైతు వారోత్సవాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపు

రేగొండ, ఆంధ్రప్రభ : రైతులు, పాడి పశువుల పెంపకదారులు, మత్స్యకారుల అభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యరంగాలను సమన్వయంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన పశుసంవర్ధక చికిత్స–అవగాహన శిబిరం, రైతు వారోత్సవం, రైతు వారం నీటిపారుదల కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. పాడి పశువుల్లో గర్భకోశ సంబంధిత వ్యాధులకు ఉచిత చికిత్స అందించడంతో పాటు మేలు జాతి దూడల పెంపకానికి లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భాధాన సేవలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. మత్స్యరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం చెరువుల్లో కలుపు నివారణ, చేపల వ్యాధుల నియంత్రణ, చేపల ఉత్పత్తి పెంపు చర్యలను వేగవంతం చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

నీటిపారుదల శాఖ కార్యక్రమాలపై మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులు, గేట్ల నిర్వహణ, కాలువల్లో పూడిక తొలగింపు, జమ్ము–కంపచెట్ల నిర్మూలన వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి అందుబాటు పెరిగితేనే రైతు ఆర్థికంగా బలపడతాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఆసోడా కుమారస్వామి, మత్స్యశాఖ జిల్లా అధికారి విజయ్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్‌రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మత్స్యకారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.