Registration | రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లలో గందరగోళం

Registration | రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లలో గందరగోళం
Registration | పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఇబ్బందులు
సర్వర్, సాఫ్ట్‌వేర్ లోపాలతో పెండింగ్ పెరుగుదల
షోరూమ్‌లపై ఒత్తిడి, డెలివరీలు నిలిపివేత
పాత విధానానికి మద్దతు పెరుగుదల
వాహన్ పోర్టల్ సమస్యలు తాత్కాలికమే: అధికారులు
ప్రారంభంలో టెక్నికల్ సమస్యలు తప్పవు
కొద్దిరోజుల్లోనే అన్ని సర్దుకుంటాయి
తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ అధికారులు
Registration | హైదరాబాద్,ఆంద్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత ఇరవై రోజులుగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వాహన యజమానులు, షోరూమ్ యాజమాన్యాలు, డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెక్నికల్ సమస్యల కారణంగా టెంపరరీ రిజిస్ట్రేషన్లు మాత్రం వెంటనే జారీ అవుతున్నప్పటికీ, పర్మనెంట్ నంబర్ల జారీ ఆలస్యమవుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్‌లోనే టెంపరరీ, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే సర్వర్ సమస్యలు, సాఫ్ట్‌వేర్ లోపాలు కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో వేలాది వాహనాల రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వాహన యజమానులు తీవ్ర అసౌకర్యంకు గురవుతున్నారు. పర్మనెంట్ నంబర్ ప్లేట్లు రాకపోవడంతో రోడ్లపై ప్రయాణించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు నిర్వహించే తనిఖీల సమయంలో కూడా అనవసరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక షోరూమ్ యాజమాన్యాల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కస్టమర్ల ఒత్తిడి పెరగడంతో పాటు వాహనాల డెలివరీలు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డీలర్లపై పెండింగ్ ఫైళ్ల భారం పెరిగి, టెక్నికల్ సమస్యలపై కస్టమర్లతో వాదనలు జరుగుతున్నాయి. షోరూమ్‌లలో వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన టెక్నికల్ ట్రెయినింగ్ లు ప్రభుత్వం అందించకపోవడంతో ఇబ్బందులు తీవ్రతరంగా మారాయని షోరూమ్ యజమానలు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ పరిస్థితిపై పాత విధానం మళ్లీ మంచిదనే అభిప్రాయం బలపడుతోంది. గతంలో షోరూమ్‌లలో టెంపరరీ రిజిస్ట్రేషన్ ఇచ్చి, అనంతరం వాహన యజమానులు ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు వెళ్లి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే విధానం అమలులో ఉండేది. ఆ విధానం ద్వారా టెక్నికల్ సమస్యల ప్రభావం తక్కువగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డిజిటల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం కంటే సాంకేతిక లోపాలను సరిచేసి మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సర్వర్ సామర్థ్యాన్ని పెంచడం, బ్యాకప్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి, సౌలభ్యం కలిగించే కొత్త విధానం టెక్నికల్ సమస్యలతో నిలిచిపోవడం వల్ల ప్రస్తుతం పాత విధానం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సాంకేతిక సమస్యలు తాత్కాలికమే
వాహన్ పోర్టల్ లో సమస్యలు తాత్కాలికమే… ప్రారంభంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలు వచ్చాయి. కొద్ది రోజుల తర్వాత సమస్యలు సమసిపోయి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. కంగారు పడాల్సినదేమి లేదు. ఒక కొత్త విదానికి అందరూ అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. ఇది కూడా అంతే… ఇటు వాహన డీలర్లకు, కొనుగోలుదార్లకు అనుగునంగా సేవలందించాడానికి సాంకేతికపరమైన మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కావున సంయమనం పాటించాలని కోరుతున్నాము. వాహన్ పోర్టల్ ప్రస్తుతం ఎన్ఐసీ బృందం నిరంతర సాంకేతిక సహకారంతో దశలవారీగా స్థిరీకరించబడుతోంది. అదనపు మాడ్యూల్స్‌ను కూడా దశలవారీగా అమలు చేస్తున్నాము. రాబోయే 15 రోజుల్లో ఈ వ్యవస్థ పూర్తిగా స్థిరపడుతుంది అని భావిస్తున్నాము. తద్వారా అన్ని సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు సమర్థవంతమైన, పౌర కేంద్రిత సేవలు అందించడం పట్ల శాఖ కట్టుబడి ఉందని తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ ఉన్నతాధికారి తెలిపారు.
