మహిళాబిల్లు వీగిపోవడం దురదృష్టకరం..

మహిళాబిల్లు వీగిపోవడం దురదృష్టకరం..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : మహిళా రిజర్వేషన్ బిల్లు లోకసభలో వీగిపోవడం దురదృష్టకరమని మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సాహెరా భాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల లోకసభలో ప్రవేశపెట్టిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ కు బ్రేక్ పడడం బాధాకరమని అన్నారు. ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని సంబరపడేలోపే, జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన వంటి కొర్రీలతో దానిని 2029 వరకు వాయిదా వేయడం మహిళా లోకాన్ని వంచించడమేనని ఆమె విమర్శించారు.

దశాబ్దాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ బిల్లు, సాంకేతిక కారణాల సాకుతో అమలు కాకపోవడం వల్ల రాజకీయంగా ఎదగాలనుకునే మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. కేవలం ఎన్నికల ప్రచార అస్త్రంగానే మహిళా బిల్లును వాడుకుంటున్నారని, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ కోటాను అమలు చేసి మహిళా సాధికారతకు బాటలు వేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న ఈ కాలయాపన పై ప్రభుత్వం, ప్రతిపక్షాలు పునరాలోచించాలని, లేనిపక్షంలో మహిళల హక్కుల కోసం మానవ హక్కుల సంఘం పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని డాక్టర్ సాహెరా భాను హెచ్చరించారు.

Leave a Reply