వైభవంగా ఆధ్యాత్మిక మహోత్సవాలు..

వైభవంగా ఆధ్యాత్మిక మహోత్సవాలు..

ఇంద్రకీలాద్రిపై నిర్వహణకు సన్నాహాలు..
అక్షరాభ్యాసాలు, శాఖంభరీ ఉత్సవాలు, ఆషాఢ సారె..
కృష్ణానదీ పుణ్య హారతులకు శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటు..
భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన
ఉత్సవాల నిర్వహణలో సమన్వయంతో పనిచేయాలి
దుర్గగుడి ఈవో శీనా నాయక్
దుర్గగుడి అధికారులతో ఈవో ప్రత్యేక సమీక్ష.

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రాబోయే రోజుల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవస్థానం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు, కృష్ణానదీ పుణ్య హారతులు, ఆషాఢ సారె సమర్పణ, శాఖంభరీ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 17న మహామండపంలో నిర్వహించనున్న ఉచిత సామూహిక అక్షరాభ్యాస మహోత్సవానికి సంబంధించి భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, పూజా సామాగ్రి పంపిణీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలను సమీక్షించారు. కార్యక్రమానికి హాజరయ్యే కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద నిర్వహిస్తున్న పవిత్ర కృష్ణానదీ పుణ్య హారతులకు భక్తుల ఆదరణ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఘాట్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగానికి సూచించారు.

భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే నెల జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు నెలరోజుల పాటు జరిగే ఆషాఢ సారె సమర్పణ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జులై 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న శాఖంభరీ ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పుష్పాలతో అలంకరించే కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. దేవస్థానం సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా వైదిక, పరిపాలనా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈవో వీకే శీనా నాయక్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, శంకర శాండిల్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రమాదేవి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చంద్రశేఖర్, సుధారాణి, ఎన్. రమేష్ బాబు, కె. గంగాధర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *