పశ్చిమలో ఘనంగా డా. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు
పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
సంక్షేమానికి ఆద్యుడు వైఎస్సార్..
దాన్ని ముందుకు నడిపింది జగన్!
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
కూటమికి బుద్ధి చెప్పేందుకు.. జగనన్న కోసం ప్రజలు వెయిటింగ్!
భవానిపురం, ఆంధ్రప్రభ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ అన్ని కార్యక్రమాలలో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలుచోట్ల కేక్ కట్ చేసి, పేదలకు సంక్షేమ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేసినప్పటికీ, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పాలన సాగించారని కొనియాడారు.

“ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి, సంక్షేమ పథకాలను పేదలకు ఎలా అందించాలి” అనేదానికి వైఎస్సార్ నిదర్శనంగా నిలిచారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్య, పేదలందరికీ సొంతిళ్లు వంటి విప్లవాత్మక పథకాలకు ఆద్యుడు వైఎస్సార్ అని, ఆయన పాలన సంక్షేమ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని గుర్తుచేశారు. అదేవిధంగా, వైఎస్సార్ ఆశయాలను, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2019 నుండి 2024 వరకు మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారని వెలంపల్లి పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఆరోగ్యశ్రీ బలోపేతం వంటి ఎన్నో పథకాలతో పేద ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. మళ్లీ రాష్ట్రంలో అటువంటి సంక్షేమ పాలన రావాలని, జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పేదలకు మేలు జరుగుతుందని ప్రజలందరూ బలంగా విశ్వసిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మండిపడుతూ, మోసపూరిత హామీలతో 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, రెండు సంవత్సరాలు కాకముందే ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ నాటి ప్రజాభిప్రాయం స్పష్టం చేస్తోందన్నారు.
వివిధ డివిజన్లలో జరిగిన కార్యక్రమాలు…
మాజీ కార్పొరేటర్ షేక్ రెహమాతున్నీసా, హయత్ ల ఆధ్వర్యంలో 38వ డివిజన్ కుమ్మరిపాలెం సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో వెలంపల్లి వైయస్ ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు. 40వ డివిజన్ బ్యాంక్ సెంటర్ వద్ద మాజీ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయరెడ్డి, డివిజన్ అధ్యక్షులు రేగులగుంట రమణయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచారు.
అలాగే నాగయ్య హోటల్ సెంటర్ వద్ద వైసిపి నాయకులు వణుకూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. మాజీ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పువ్వాడ వెంకటేశ్వరరావు ల ఆధ్వర్యంలో 42వ డివిజన్ శివాలయం సెంటర్ లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం కుండల బజార్ వద్ద గల పార్క్ లోని వైయస్ ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.. 43వ డివిజన్, బెవర నాగేశ్వరరావు వీధిలో వైసిపి నాయకులు బెవర నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైయస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఊర్మిళ నగర్లో మాజీ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పేదలకు పండ్లు, మిఠాయిలు అందజేశారు. వైసిపి నాయకులు చేపూరి శ్రీను ఆధ్వర్యంలో 49వ డివిజన్ ఫ్రైజర్ పేట లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లను పంపిణీ చేశారు.
మాజీ కార్పొరేటర్, మాజీ చైర్మన్ బండి పుణ్యశీల, డివిజన్ అధ్యక్షులు బండి రాజ్ కుమార్ ల ఆధ్వర్యంలో 34వ డివిజన్ ఎర్ర కట్ట డౌన్, వైఎస్సార్ పార్క్ నందు వై యస్ ఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించి, పేదలకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాయన నరేంద్ర ల ఆధ్వర్యంలో 46వ డివిజన్ లోని మాజీ మేయర్ కార్యాలయం నందు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
