స్టేటస్ కోను పట్టించుకోని అధికారులు..!
స్టేటస్ కోను పట్టించుకోని అధికారులు..!
అచ్చంపేట, ఆంధ్రప్రభ:
జిల్లా కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉండగానే వివాదాస్పద స్థలంలో నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారన్నదానిపై అచ్చంపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి అధికారులు వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట పట్టణానికి చెందిన ఎ. చంద్రశేఖర్ ఈ నెల 23న మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, అచ్చంపేట పట్టణంలోని సర్వే నెంబర్ 147లోని 20 గుంటల భూమిని అహ్మద్ హుస్సేన్ నుంచి కొనుగోలు చేశానని తెలిపారు. ఈ భూమి వివాదానికి సంబంధించి AS నెం.57/2025లో, IA నెం.381/2025 కింద కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.
అయినప్పటికీ కొందరు వ్యక్తులు మున్సిపల్ అధికారులను తప్పుదారి పట్టించి అక్రమ నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వుల ప్రతులను అధికారులకు అందజేసినా టౌన్ ప్లానింగ్ విభాగం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
స్టేటస్ కో అమల్లో ఉన్నప్పుడు నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని, అయినప్పటికీ ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో అధికారులు వివరణ ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్న ఆదేశాలను ఉల్లంఘిస్తే అది కోర్టు ధిక్కరణ అవుతుందని పేర్కొన్నారు.
కోర్టు తీర్పు వెలువడే వరకు నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయాలని చంద్రశేఖర్ కోరుతున్నారు.
ఇదే విషయమై టౌన్ ప్లానింగ్ అధికారి మనోజ వివరణ ఇస్తూ, స్టేటస్ కో ఉత్తర్వులు వెలువడకముందే అంటే 2024 నవంబర్ 22న నిర్మాణ అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారమే అనుమతులు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

