Murugan Controversy | ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై వివాదం..

సినిమాను నిలిపివేయాలన్న ఎన్టీకే పార్టీ అధినేత సిమాన్
తమిళుల ఇష్ట దైవం మురుగన్‌ సుబ్రహ్మణ్యంను..
ఉత్తరాంధ్ర దైవంగా చూపడంపై సిమాన్ అభ్యంతరం
సినిమాను ఆపకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం-సిమాన్
సుబ్రహ్మణ్యంస్వామి తమిళనాడు దైవమని ఆధారాలున్నాయి
తమిళుల మనోభావాలను కించపరిస్తే ఊరుకోం-సిమాన్‌

Murugan Controversy | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్–త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పౌరాణిక చిత్రం ప్రారంభానికి ముందే వివాదంలో చిక్కుకుంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టు తమిళనాడులో రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. తమిళుల ఆరాధ్య దైవమైన మురుగన్ (సుబ్రహ్మణ్యస్వామి) గురించి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్‌టీకే) పార్టీ అధినేత సీమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త చిత్రం (తాత్కాలికంగా ఎన్‌టీఆర్–త్రివిక్రమ్ లేదా గాడ్ ఆఫ్ వార్ పేరుతో ప్రచారంలో ఉన్న సినిమా) అనౌన్స్‌మెంట్ అనంతరం వివాదానికి కేంద్రబిందువైంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ విడుదల చేసిన పోస్టర్‌లోని క్యాప్షన్‌లో “ఉత్తరాదిన జన్మించి, హృదయభూమిలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు” అనే వ్యాఖ్యలు ఉండటంపై తమిళనాడులో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు మురుగన్ స్వామి మూలాలను తప్పుగా చిత్రీకరిస్తున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ అంశంపై స్పందించిన నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) పార్టీ అధినేత సీమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మురుగన్ లేదా సుబ్రహ్మణ్యస్వామి తమిళుల ఆరాధ్య దైవమని, ఆయనను ఉత్తరాంధ్ర లేదా ఉత్తర భారతదేశానికి చెందిన దైవంగా చూపించే ప్రయత్నం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనని ఆరోపించారు.

తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా రూపొందితే అంగీకరించబోమని సీమాన్ హెచ్చరించారు. చిత్రబృందం ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని, అవసరమైతే సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమిళనాడులో ఆందోళనలు చేపడతామని, సినిమా విడుదలను కూడా వ్యతిరేకిస్తామని ప్రకటించారు.

ఈ వివాదంపై సామాజిక మాధ్యమాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం తమిళ సంగం సాహిత్యంలో మురుగన్ స్వతంత్ర తమిళ దైవంగా ప్రస్తావించబడ్డారని వాదిస్తుండగా, మరోవైపు పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యస్వామి శివపార్వతుల కుమారుడిగా హిమాలయ ప్రాంతంలో అవతరించిన అఖిల భారత ఆరాధ్య దైవమని మరో వర్గం అభిప్రాయపడుతోంది.

ఇప్పటివరకు ఈ వివాదంపై చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు. అయితే అనౌన్స్‌మెంట్ దశలోనే ఈ సినిమా చుట్టూ వివాదం చెలరేగడంతో చిత్రబృందం ఎలాంటి వివరణ ఇస్తుందనే ఆసక్తి నెలకొంది.