ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : మంత్రి గొట్టిపాటి రవికుమార్
మంగళగిరి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, వివిధ వర్గాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రికి వివరించి అర్జీలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితుల నుంచి సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారంలో వేగవంతమైన స్పందనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా వేదిక వంటి గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అధికారుల సమన్వయంతో పరిష్కరించే అవకాశం కలుగుతోందన్నారు.
జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
