బాలకృష్ణ సేవలు, విజయాలు యువతకు స్ఫూర్తి
బాలకృష్ణ సేవలు, విజయాలు యువతకు స్ఫూర్తి
గద్దె క్రాంతి కుమార్
విజయవాడ, ఆంధ్రప్రభ : రాజకీయ నాయకుడిగా హిందూపూర్ ప్రజలకు సేవలందిస్తూ, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తూ, కథానాయకుడిగా తన నటనతో అభిమానుల మన్నలని పొందుతున్న బాలకృష్ణ యువతకు స్ఫూర్తిదాయకమని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు. బుధవారం 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ పడవల రేవు సెంటర్ వద్ద నటసింహం నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలను కంటిపూడి శేషుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దె క్రాంతి కుమార్ హాజరైన కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పాదాచారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రనటుడిగా కొనసాగుతూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు నందమూరి బాలకృష్ణ అని కొనియాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తూ సినీ, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు.
యువ హీరోలకు పోటీగా వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తన ప్రత్యేక నటనతో ప్రేక్షకుల ఆదరణను చూరగొంటున్నారని తెలిపారు. దేశ విదేశాల్లో సైతం “జై బాలయ్య” నినాదాలు మారుమోగడం ఆయనకు ఉన్న అపార ప్రజాదరణకు నిదర్శనమని అన్నారు. రాజకీయ నాయకుడిగా హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. తన తల్లి పేరుతో స్థాపించబడిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ సేవామూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు.
కళాకారుడిగా, ప్రజాప్రతినిధిగా, సేవా దృక్పథం కలిగిన నాయకుడిగా బాలకృష్ణ గారు సృష్టిస్తున్న విజయాలు, రికార్డులు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భగవంతుడు బాలకృష్ణ కి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించి ప్రజలకు మరింత కాలం సేవ చేసే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాదిరెడ్డి అమ్ములు, చెరుకూరి మురళి, ఆకుమళ్ళ సిద్దయ్య, కృష్ణ, కుర్రా నాని, తోట ప్రసన్న, కేతినేని శ్రావణి, అంజలి, కోటేశ్వరరావు, కొల్లిపర పవన్, బలరాం, రాంబాబు, కాకర్ల మధు, శ్రీకాంత్ లతో పాటు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
