సంప్ర‌దాయ వ‌స్త్ర సోయ‌గం.. ఇండియ‌న్ సిల్క్ గ్యాల‌రీ..

14 రాష్ట్రాల హస్త‌క‌ళాకారుల అత్య‌ద్భుత డిజైన్ల‌కు వేదిక‌
ఈ నెల 29 నుంచి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు అందుబాటులో
జిల్లా వ‌స్త్ర ప్రియులు ఎక్స్‌పోను స‌ద్వినియోగం చేసుకోవాలి
కేశినేని జాన‌కి ల‌క్ష్మి


(విజయవాడ ఆంధ్రప్రభ) : భార‌తీయ వ‌స్త్ర సంప్రదాయం, కళాత్మకతకు ప్రతీకగా ఇండియ‌న్ సిల్క్ గ్యాల‌రీ ఎక్స్‌పో నిలుస్తుంద‌ని.. 14 రాష్ట్రాల హస్తకళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న అత్యద్భుతమైన డిజైన్లకు ఇది స‌రైన వేదిక అని కేశినేని జాన‌కి ల‌క్ష్మి అన్నారు. విజ‌య‌వాడ బెంజ్ సర్కిల్ స‌మీపంలోని ఎ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఏర్పాటుచేసిన ఇండియ‌న్ సిల్క్ గ్యాల‌రీ ఎక్స్‌పోను బుధ‌వారం కేశినేని జాన‌కి ల‌క్ష్మి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ చేనేత‌, పట్టు వస్త్ర సంపదకు పుట్టినిల్లుగా నిలిచిందని.. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన కాటన్, పట్టు వస్త్ర సంప్రదాల విశిష్ట‌త ఉండటం భారతీయ నేత కళాకారుల అపూర్వ నైపుణ్యానికి, మన సంస్కృతి వైభవానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి చీర వెనుక నేతన్నల శ్రమ, కళాత్మకత, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం దాగి ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉప్పాడ, ధర్మవరం పట్టు చీరలు, తమిళనాడులోని కాంచీపురం పట్టు, కర్ణాటకలోని మైసూర్ సిల్క్, తెలంగాణలోని గద్వాల్, పోచంపల్లి ఇక్కత్, పశ్చిమ బెంగాల్‌లోని బాలుచరి, తాంతి సిల్క్, ఒడిశాలోని సంభల్పురి ఇక్కత్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బెనారసీ సిల్క్ వంటి దేశంలోని ప్రసిద్ధ చేనేత, పట్టు వస్త్రాలు భారతీయ నేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయని అన్నారు. ఈ అరుదైన, నాణ్యమైన వస్త్రాలను ఒకే వేదికపై నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధృవీకరించిన సిల్క్ మార్క్ కలిగిన ఉత్పత్తులను మాత్రమే ప్రదర్శనలో విక్రయించడం వినియోగదారులకు నాణ్యతపై మరింత విశ్వాసాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లకుండానే భారతీయ పట్టు, చేనేత వైవిధ్యాన్ని ఒకేచోట వీక్షించి, తమకు నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో చక్కటి అవకాశాన్ని కల్పిస్తోందని, దీన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కేశినేని జానకి లక్ష్మి తెలిపారు.

ఈనెల 29 నుంచి ఆగ‌స్టు 3 వ‌ర‌కు గ్యాల‌రీ..
ఇండియ‌న్ సిల్క్ గ్యాల‌రీ ఎక్స్‌పో ఈ నెల 29వ తేదీ నుంచి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు అయిదు రోజుల పాటు అల‌రిస్తుంద‌ని ఎక్స్‌పో నిర్వాహ‌కులు శ్రీనివాస‌రావు తెలిపారు. చందేరి, మ‌హేశ్వ‌రి, కోట‌, రాజ్‌కోట్ ప‌టోలా.. ఇలా వివిధ ప్రాంతాల ప్ర‌త్యేక డిజైన్ల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన ప్రజలకు అందుబాటులో ఉంటుందని, కుటుంబ సమేతంగా వచ్చి భారతీయ చేనేత, పట్టు వస్త్రాల వైవిధ్యాన్ని వీక్షించి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలకు అనువైన పట్టు చీరలు, చేనేత వస్త్రాలు, డ్రెస్సు మెటీరియల్స్, దుపట్టాలు తదితర ఉత్పత్తులు విస్తృతంగా ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. అన్ని వస్త్రాల‌ను నేరుగా నేత కళాకారులు, సహకార సంఘాలు, ప్రామాణిక తయారీదారులే ప్ర‌ద‌ర్శిస్తుండ‌టం వ‌ల్ల నాణ్యతతో పాటు సరసమైన ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వినియోగదారులు స్వచ్ఛమైన పట్టు వస్త్రాలను నమ్మకంగా కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని శ్రీనివాస‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఎం.మంజుల తదితరులు పాల్గొన్నారు.