నేరేడుచర్ల పీహెచ్‌సీలో వైద్య సేవలు అభినందనీయం

ఆకస్మిక తనిఖీలో ప్రశంసించిన జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ధి

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ: నేరేడుచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు అభినందనీయంగా ఉన్నాయని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ధి ప్రశంసించారు.

బుధవారం ఆమె నేరేడుచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డు, లేబర్ రూమ్‌ను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

పీహెచ్‌సీలో బుధవారం ఉదయం సాధారణ ప్రసవం ద్వారా ఆడశిశువుకు జన్మనిచ్చిన దేవిని ప్రత్యేకంగా పలకరించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన డాక్టర్ ప్రసిద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షిత ప్రసవ సేవలు అందిస్తున్న వైద్యురాలు డాక్టర్ పున్న నాగినిని అభినందించారు.

ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు, పోషకాహారం, ప్రసవానంతర సంరక్షణను ఎలాంటి లోటు లేకుండా అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోగులతో ఆప్యాయంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా పనిచేయాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో ప్రజలు విశ్వాసంతో ముందుకు వస్తుండటం సంతోషకరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో సల్వాది శ్రీనివాస్, నర్సింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఏఎన్‌ఎం సునీత, ఆశా కార్యకర్తలు యశోద, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.