అమరావతి ఛాంపియన్‌షిప్‌లో ఎల్‌బీఆర్‌సీఈ విద్యార్థుల సత్తా

  • అన్ని విభాగాల్లో జిల్లా స్థాయికి ఎంపిక..
  • కళాశాలకు మరోసారి కీర్తి

మైలవరం, ఆంధ్రప్రభ: స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (ఎల్‌బీఆర్‌సీఈ)లో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–23 విభాగానికి చెందిన ఎల్‌బీఆర్‌సీఈ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, చెస్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి అన్ని విభాగాల్లో జిల్లా స్థాయికి ఎంపికైనట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. బి. రమేష్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులను, ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు ఎస్. దుర్గా రెడ్డి, ఎం. బేబీ రాణి, ఎస్. నటరాజ్‌లను కళాశాల అధ్యక్షుడు జి. శ్రీనివాస రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా. బి. రమేష్ రెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచి కళాశాలకు మరింత కీర్తి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.