ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సింధూర రెడ్డి
ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సింధూర రెడ్డి
పుట్టపర్తి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి మున్సిపాల్టీలోని బ్రాహ్మణపల్లిలో కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సహకారంతో, ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పుట్టపర్తిలో లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో 5వ తరం యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు రానుండటం ఈ ప్రాంత అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఆమడగూరు మండలంలో 51 వేల కోట్ల పెట్టుబడితో 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో 33 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద రిలయన్స్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఇప్పటికే నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించి సుమారు 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోనే 25 వేల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు హరికృష్ణ, శాంతి, ప్రిన్సిపాల్ రమాదేవి, వివిధ కంపెనీల ప్రతినిధులు, గ్రామీణ శిక్షణ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
