Viksit Bharat 2047 | భిన్నత్వంలో ఏకత్వమే భారత బలం..
విలువలతో కూడిన విద్యే భవిష్యత్తుకు పునాది : రాష్ట్రపతి ముర్ము
విభిన్న భాషల విద్యార్థులను ఏకం చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ..
నైతిక విలువలతో ముందుకు సాగాలని పట్టభద్రులకు పిలుపు
Viksit Bharat 2047 | అనంతపురం, ఆంధ్రప్రభ : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్ప సంపద అని, విభిన్న భాషలు, సంస్కృతులకు చెందిన విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో సెంట్రల్ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన అనంతపురంలో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. విజయనగర సామ్రాజ్య శిల్పకళా వైభవానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని, భారత మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ నీలం సంజీవరెడ్డితో ఈ జిల్లాకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని చెప్పారు. వారిద్దరి జీవితాలు నేటికీ దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక కీలక మైలురాయని పేర్కొన్నారు. పట్టభద్రులైన విద్యార్థులు ఎన్నో ఏళ్ల కృషి, అంకితభావం, పట్టుదలకు ప్రతిఫలంగా ఈ విజయాన్ని అందుకున్నారని అభినందించారు. స్వర్ణ పతక విజేతలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థుల కంటే విద్యార్థినులు అధిక సంఖ్యలో స్వర్ణ పతకాలు సాధించడం సంతోషకరమని అన్నారు. ఇది దేశ యువతుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించాలనే దూరదృష్టితో ఈ విశ్వవిద్యాలయం ముందుకు సాగుతోందని రాష్ట్రపతి తెలిపారు. నాణ్యమైన విద్య, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో యూనివర్సిటీ నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. ‘వికసిత్ భారత్-2047’ లక్ష్య సాధనలో ఈ విద్యాసంస్థ విశేష పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని పేర్కొంటూ, భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని సజీవంగా అనుభవించే వాతావరణాన్ని ఈ విశ్వవిద్యాలయం కల్పిస్తోందని చెప్పారు. ఇలాంటి పరస్పర సాంస్కృతిక అనుబంధాలు జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేస్తాయని వివరించారు.

విద్యార్థులు తమ విజయాల వెనుక ఉన్న తల్లిదండ్రుల త్యాగం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సమాజం అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరవకూడదని రాష్ట్రపతి సూచించారు. తాము పొందిన విద్యను సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించాలని, పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, ప్రభుత్వ సేవాధికారులుగా లేదా ప్రజాసేవకులుగా ఏ రంగంలో ఉన్నా సమాజానికి సేవ చేయాలన్నారు.

ఈ విశ్వవిద్యాలయం తొలి పట్టభద్రులుగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారని పేర్కొన్న ఆమె, విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ విద్యార్థుల విజయాలు, వ్యక్తిత్వం, ప్రవర్తన, సమాజానికి చేసే సేవలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. జీవితాంతం ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధాన్ని కొనసాగించాలని, యూనివర్సిటీకి రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్య పట్టాతో ముగిసిపోకూడదని, కొత్త సాంకేతికతలను నిరంతరం నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్రపతి సూచించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సైన్స్ వంటి ఆధునిక అంశాలను తప్పనిసరి కోర్సులుగా ప్రవేశపెట్టడం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతను సిద్ధం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతే ప్రధాన శక్తి అని పేర్కొన్న రాష్ట్రపతి, నిబద్ధత, నిజాయితీ, కరుణ, సహానుభూతి, ప్రకృతి పట్ల గౌరవం వంటి నైతిక విలువలు జీవితానికి బలమైన పునాదిగా నిలుస్తాయని చెప్పారు. ఈ విలువలు వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాకుండా సమాజానికి, దేశానికి అర్థవంతమైన సేవ చేసేందుకు దోహదపడతాయని వివరించారు.
ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, దేశం నిర్దేశించుకున్న మహత్తర లక్ష్యాల సాధనలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలని ఆకాంక్షిస్తూ, పట్టభద్రులందరికీ ఉజ్వలమైన, సార్థకమైన భవిష్యత్తు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
