పసిబిడ్డకు చికిత్సకు అండగా ప్రభుత్వం
– మంత్రి పయ్యావుల కేశవ్ భరోసా
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం హామీ
ఉరవకొండ రూరల్, జులై 2 (ఆంధ్రప్రభ): ఉరవకొండ పట్టణానికి చెందిన హనుమంతు కుమారుడు, 6 నెలల చిన్నారి కుమ్మర లోకేష్ అరుదైన ప్రాణాంతక వ్యాధి ప్రైమరీ హీమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH)తో ప్రాణాల కోసం పోరాడుతున్న నేపథ్యంలో, బాధిత కుటుంబ సభ్యులు మండలంలోని పెద్దకౌకుంట్ల గ్రామంలో గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిశారు.
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి పయ్యావుల కేశవ్, పసిబిడ్డను ప్రేమగా ఎత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. తల్లిదండ్రుల కళ్లలోని ఆవేదనను గమనించిన మంత్రి, “మీ బిడ్డకు అవసరమైన చికిత్స అందేలా నేను అండగా ఉంటాను. ఎలాంటి ఆందోళన చెందవద్దు” అని భరోసా ఇచ్చారు.
చిన్నారి చికిత్సకు సుమారు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్ యాజమాన్యంతో మంత్రి నేరుగా ఫోన్‌లో మాట్లాడి, చిన్నారికి ఎలాంటి ఆలస్యం లేకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున నిధులు త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు దాతలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు.
