డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని కళ్లకు గంతలతో నిరసన

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ ; కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై కూర్చోని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం అంటూ మాటలు చెప్పే మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన బంపర్ ఆఫర్ ధరలు పెంచడమే అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల వల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నారు. ఈ భారం మొత్తం సామన్య ప్రజల పైన పడుతుందన్నారు.

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు పెట్రోలియం ధరలను పెంచారని అన్నారు. పెంచిన పెట్రోలియం ధరలను వెంటనే తగ్గించాలని సామాన్య ప్రజలకు అండగా నిలవాలని లేదంటే రానున్న ఎన్నికల్లో బిజేపీ తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కత్తి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, మండల ఏఐటీయూసీ అధ్యక్షుడు ఊదర వెంకన్న, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, మండలాధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికె భరత్, గురునాథం ఉన్నారు.