తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే మోడీ ఉచిత సలహాలు

తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే మోడీ ఉచిత సలహాలు
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన విదేశాంగ విధాన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం వల్ల దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, దీనికి మోదీ అనుసరిస్తున్న తప్పుడు విదేశాంగ విధానమే కారణమన్నారు. రష్యా, ఇరాన్ వంటి మిత్రదేశాలను కాదని, అమెరికా ప్రయోజనాల కోసం మోదీ మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి హామీలు ఏమయ్యాయి ?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని జాన్ వెస్లీ ఆరోపించారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణానికే పరిమితమై.. దళితబంధు, రైతుకూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతులకు రూ. 12,500, మహిళలకు రూ. 2,500, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వంటి ప్రధాన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
చమురు నిల్వల కోసమే సామ్రాజ్యవాద యుద్ధాలు
పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సామ్రాజ్యవాద దేశాలు చమురు నిల్వలున్న దేశాలపై దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. అదానీ, అంబానీల వ్యాపార ప్రయోజనాల కోసం 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి
పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పేరుకుపోయిన స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నిర్వహించిన సర్వేలో ప్రతి కుటుంబం అప్పుల ఊబిలో ఉన్నట్లు తేలిందని, పాలకుల నిర్లక్ష్యంపై పోరుబాట పట్టాలని కోరారు. అంతకుముందు సీనియర్ నాయకులు ఎండి పాషా పార్టీ జెండాను ఆవిష్కరించగా, రొడ్డ అంజయ్య చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, కొండమడుగు నరసింహ, కల్లూరు మల్లేశం, మున్సిపల్ కౌన్సిలర్ బత్తుల జయమ్, నాయకులు గోశిక కరుణాకర్, గంగాదేవి సైదులు, పల్లె మధు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
