డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్‌కు ఘన వీడ్కోలు
తిరుపతి కలెక్టర్, ఆంధ్రప్రభ : డిప్యూటీ కలెక్టర్ కేఎం రోజ్ మాండ్‌కు శుక్రవారం తిరుపతి కలెక్టరేట్‌లో ఘనంగా వీడ్కోలు పలికారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు కలిసి ఆమెను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 35 ఏళ్లపాటు రెవెన్యూ శాఖలో రోజ్ మాండ్ నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. తహసీల్దార్‌గా, డిప్యూటీ కలెక్టర్‌గా పలు కీలక బాధ్యతలు సమర్థంగా నిర్వహించారని చెప్పారు.
ఎన్నికల నిర్వహణ, భూ రక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాల్లో ఆమె అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో రోజ్ మాండ్ చూపిన క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అందరికీ ఆదర్శమని కొనియాడారు.
జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల నిర్వహణ, భూ రక్షణకు సంబంధించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రభుత్వానికి సమయానుకూలంగా నివేదికలు అందించారని తెలిపారు.
పదవీ విరమణ పొందిన డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్ మాట్లాడుతూ.. తనకు సహకరించిన అధికారులు, సహోద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని పేర్కొన్నారు. పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించిన జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీఓలు కలిసి రోజ్ మాండ్ దంపతులను ఘనంగా సన్మానించారు.
