విమానాశ్రయ భద్రత మరింత బలోపేతం…
విమానాశ్రయ భద్రత మరింత బలోపేతం…
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విమానాశ్రయ ప్రాంగణంలో నిర్వహించిన ఎయిర్‌పోర్టు భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విమానాశ్రయం వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతా లోపాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
వివిధ శాఖల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనతో పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. సమాచార మార్పిడి వేగవంతంగా జరిగేలా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, రెవెన్యూ, ఫైర్, వైద్య, విమానాశ్రయ నిర్వహణ విభాగాలు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ప్రతి విభాగం తమ బాధ్యతలను స్పష్టంగా అర్థం చేసుకుని సమయానికి స్పందించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
విమానాశ్రయంలో అమలవుతున్న భద్రతా ప్రమాణాలు, ప్రస్తుత ఏర్పాట్లపై సిబ్బంది రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించిన కలెక్టర్, లోపాలను గుర్తించి తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. సీసీటీవీ పర్యవేక్షణ, ప్రవేశ నియంత్రణ, ప్రయాణికుల భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. భద్రతా సిబ్బందికి తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు. విమానాశ్రయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ సువర్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, విమానాశ్రయ నిర్వాహకులు పాల్గొన్నారు.
