సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం

సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం

  • జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలి
  • స్థానికంలో, పార్టీ పదవుల్లో కేటాయింపులు జ‌ర‌గాలి
  • కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ సమావేశంలో
  • మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాబోయే స్థానిక ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ పదవులలో జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని, సామాజిక న్యాయం పాటించినప్పుడే పార్టీకి క్షేత్రస్థాయిలో తిరుగులేని విజయం లభిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని రెడ్లాస్ హోటల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో జిల్లా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికైనా వారి జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తూ టిక్కెట్ల పంపిణీ జరగాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మెదక్ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కాలని ఆయన కోరారు. మంత్రులు దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ పార్టీలో వర్గపోరు లేనప్పుడే పార్టీకి లాభం జరుగుతుందని అన్నారు, అందరినీ కలుపుకొని పార్టీని విజయపథంలో నడిపిస్తామని నేతలకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పటాన్చెరు పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ అంజ‌య్య‌, టీపీసీసీ ఉపాధ్యక్షులు శశికళ యాదవ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చిన్న ముదిరాజ్, టోపాజీ అనంత కిషన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కాట సుధ, కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply