అమెజాన్ డెలివరీలో భారీ మోసం..

అమెజాన్ డెలివరీలో భారీ మోసం..
ఢిల్లీ పోలీసుల వేటలో దొరికిన కేటుగాళ్లు!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పేరుతో జరిగిన ఒక భారీ ఆన్‌లైన్ మోసాన్ని ఢిల్లీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఆర్డర్ చేసిన వస్తువులను కస్టమర్‌కు చేరకుండానే ‘డెలివరీ’ అయినట్లు చూపిస్తూ, సుమారు రూ. 35 లక్షల విలువైన ఐఫోన్లను పక్కదారి పట్టించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని శాస్త్రి నగర్‌కు చెందిన సుమిత్ అగర్వాల్ అనే వ్యక్తి ఏప్రిల్ 12 నుంచి 16వ తేదీ మధ్య అమెజాన్ ద్వారా మొత్తం 50 ఐఫోన్ 16 (128 GB) ఫోన్లను ఆర్డర్ చేశారు.

అయితే అమెజాన్ యాప్‌లో అన్ని ఫోన్లు సక్సెస్‌ఫుల్‌గా “డెలివరీ” అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. కానీ, సుమిత్‌కు ఒక్క ఫోన్ కూడా అందలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, రూ. 35 లక్షల మేర మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న భరత్ నగర్ పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. డెలివరీ ప్రక్రియలోనే లోపం ఉందని గుర్తించిన పోలీసులు, డెలివరీ ఏజెంట్లపై దృష్టి సారించారు. అమెజాన్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న జస్‌ప్రీత్ సింగ్ (21) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జస్‌ప్రీత్ స్నేహితుడు హిమాన్షు (30) ఇద్దరూ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ప్లాన్ వేసినట్లు తేలింది. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 సీల్డ్ ఐఫోన్ 16 యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ. 10 లక్షలుగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు,
