పారదర్శకంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ

పారదర్శకంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ

జూలై 14 వరకు ఇంటింటి సర్వే, ఫారాల సేకరణ.. ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు

చిత్తూరు, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటరు జాబితా ప్రక్షాళన, ఇంటింటి సర్వే, గణన పత్రాల పంపిణీ, సేకరణ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం మొదటి దశలో ఇంటింటి సర్వే, గణన పత్రాల పంపిణీ, సేకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమం జూలై 14 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్ల తొలగింపునకు ఫారం-7, పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాల సవరణకు ఫారం-8 వినియోగించుకోవచ్చని వివరించారు.

జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలనే ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

ప్రతి సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి సూచనలు, అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలతో సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో నివసిస్తున్న ఓటర్లు కూడా అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ద్వంద్వ ఓటర్ల గుర్తింపు, మరణించిన వారి పేర్ల తొలగింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు ద్వారా ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించనున్నట్లు తెలిపారు.

రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లకు అవసరమైన సమాచారం అందజేస్తున్నామని చెప్పారు. బీఎల్‌వోలు రాజకీయాలకు అతీతంగా నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం జిల్లాలో సుమారు 80 శాతం మేర ఫారం-2 పంపిణీ పూర్తయిందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి గణన పత్రాలు నింపి బీఎల్‌వోలకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఓటరు మ్యాపింగ్ మొత్తం 2002 ఓటరు జాబితా ఆధారంగా జరుగుతోందని, ఆ జాబితా అందుబాటులో ఉంచామని తెలిపారు. 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారు తమ తల్లిదండ్రుల పేరు, సీరియల్ నంబరు ఆధారంగా వివరాలు సమర్పించాలని సూచించారు.

2002 జాబితాలో పేరు లేకపోయినా పదో తరగతి ధ్రువపత్రం, జనన ధ్రువీకరణ పత్రం, పెన్షన్ ధ్రువీకరణ పత్రం తదితర ఎన్నికల సంఘం గుర్తించిన పత్రాల ద్వారా అర్హత నిరూపించుకోవచ్చని వివరించారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో ఇంటింటి సర్వే, రెండో దశలో దరఖాస్తుల పరిశీలన, సవరణలు, మూడో దశలో తుది ఓటరు జాబితా ప్రచురణ చేపడతామని చెప్పారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి సుమారు 1,200 మంది ఓటర్లకు ఒక బీఎల్‌వోను నియమించామని తెలిపారు. వారు ప్రతిరోజూ కనీసం 30 గణన పత్రాలు సేకరించి ఎన్నికల సంఘం పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

ఓటర్లు సమర్పించిన గణన పత్రాలకు రసీదు అందజేస్తామని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్లు రోజుకు 50 వరకు గణన పత్రాలు సేకరించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

ఓటర్లు తమ గణన పత్రాలను ఈసీఐ పోర్టల్లో ఈపిక్ నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.

సమావేశంలో డీఆర్వో కె. మోహన్ కుమార్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.