పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్రలు

పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్రలు

అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరు: జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర

చిట్వేల్, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కొందరు వ్యక్తులు, రాజకీయ వర్గాలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర అన్నారు.

ఆదివారం చిట్వేల్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కొందరు రాజకీయ విశ్లేషకులు, నాయకులు, సోషల్ మీడియా వేదికల ద్వారా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఆధారాలు కోరగా, ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెలంగాణ వాదం అంటే అభివృద్ధి కోసం పరస్పర సహకారం కావాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.

పవన్ కల్యాణ్ చిత్రపటాన్ని అవమానించే చర్యలను తీవ్రంగా ఖండించిన నాగేంద్ర, అది కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న చర్య మాత్రమే కాదని, లక్షలాది మంది జనసైనికుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. అలాంటి చర్యలను ప్రజలు సహించరని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొందరు వైసీపీ నాయకులు కూడా పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న ఆయన, పవన్ కల్యాణ్‌ను ఒకే సామాజిక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నాలు వాస్తవాలకు విరుద్ధమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సహా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ఆయన నాయకుడిగా ఎదిగారని తెలిపారు.

భూముల అంశంపై వస్తున్న ఆరోపణలను ఖండించిన నాగేంద్ర, 2014లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. సంబంధిత చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తయిన భూములేనని, నిషేధిత భూముల జాబితాలో పవన్ కల్యాణ్‌కు చెందిన భూములు లేవని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలకు ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని నాగేంద్ర హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదాసు నరసింహ, బత్తిన గంగయ్య యాదవ్, మద్దూరి మన్మధ, షేక్ రియాజ్, పెద్దంగారి సాయి, ఆనందలతేజ, కావేరి అవినాష్, మలిశెట్టి రమేష్, మహంకాళి నాగేంద్ర, మాదినేని రాజా, నందు, తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply