కదిరిలో బైక్ రేసింగ్, వీలింగ్‌లపై పోలీసుల ఉక్కుపాదం

కదిరిలో బైక్ రేసింగ్, వీలింగ్‌లపై పోలీసుల ఉక్కుపాదం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం, పరిసర ప్రాంతాల్లో మోటార్‌ సైకిల్ వీలింగ్, బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకుల పై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే మొత్తం 25 మందిని గుర్తించగా, నలుగురి పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మదనపల్లి రోడ్డు, కౌలేపల్లి బ్రిడ్జి, కొత్త బైపాస్, కుటాగుళ్ళ గ్రామ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు ప్రమాదకరంగా బైక్ స్టంట్లు, రేసింగ్‌లు నిర్వహిస్తూ వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆధారంగా పలువురు యువకులను పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రకారం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, అవసరానికి మించిన డబ్బులు ఇవ్వడం వంటి కారణాలతో కొందరు యువకులు ఇటువంటి ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారు. వీలింగ్‌లు, రేసింగ్‌లు చేయడం వల్ల వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇప్పటికే గుర్తించిన వారిలో నలుగురి పై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించిన పోలీసులు, ఇకపై బైక్ రేసింగ్ లేదా వీలింగ్‌కు పాల్పడే వారిపై మాత్రమే కాకుండా, వారి తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలను సైతం జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచి, ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.