భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
ఉదృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగును పరిశీలించిన ఎస్‌డీపీఓ రవీందర్
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ములుగు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ములుగు సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీఓ) రవీందర్ సూచించారు. బుధవారం మేడారంలోని జంపన్న వాగు ఉధృతిని ఆయన పరిశీలించారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కాలువలు లేదా రహదారులపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను వరద నీరు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులు, పశువుల కాపరులు వర్షం, పిడుగులు పడుతున్న సమయంలో చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
వాహనదారులు ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని, రహదారుల పరిస్థితిని తెలుసుకున్న తర్వాతే ప్రయాణాలు చేపట్టాలని తెలిపారు. రహదారులు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం, వరద నీరు చేరడం లేదా రహదారులపై నీరు ప్రవహించడం వంటి పరిస్థితులు ఎదురైతే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ములుగు జిల్లా పోలీసు సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలు, వాగులు, ప్రధాన రహదారులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఎస్‌డీపీఓ తెలిపారు.
ప్రజలందరూ పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటిస్తూ తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని రవీందర్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పస్రా సీఐ దయాకర్, ఎస్‌ఐ కమలాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
