POCSO Cases | పెరుగుతున్న పొక్సో కేసులు..
POCSO Cases | పెరుగుతున్న పొక్సో కేసులు..
POCSO Cases | ఉలిక్కిపడుతున్న సమాజం..
బంధుత్వాలను మరిచి మృగాలుగా మారుతున్న దుండగులు..
ఒక్కరి తప్పిదం.. కుటుబాలపై చెరగని మచ్చ..
POCSO Cases | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : బాల్యం అంటే అమాయకత్వం.. బయటకు చెప్పలేరనే ధైర్యంతో, భయపెట్టి మౌనం పాటింపజేయొచ్చనే భావనతో చిన్నారులపై కామాంధుల కన్ను పడుతోంది. అభం శుభం తెలియని బాలికలు లైంగిక వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన వ్యక్తులే రాక్షసులుగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో నమోదవుతున్న పొక్సో కేసులు పరిస్థితి ఎంత భయానకంగా మారిందో తెలియజేస్తున్నాయి. రఘునాథపల్లి మండలంలో ఒక్క నెలలో మూడు, నాలుగు పొక్సో కేసులు నమోదు కావడంపై ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి కేసు వెనుక ఒక చిన్నారి కన్నీరు, ఒక కుటుంబం ఆవేదన, సమాజం తలదించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనలను పరిశీలిస్తే, పరాయివారే కాకుండా బంధువులు, పరిచయస్తులే మైనర్ బాలికలపై దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని బంధువులు, కుటుంబ స్నేహితులు వంటి వారు చిన్నారులను వేధించడం సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఇలాంటి సంఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఇది సమాజంలో అత్యంత బాధాకరమైన విషయం.
ఉలిక్కి పడుతున్న సమాజం..
అశ్లీల వీడియోల ప్రభావం, వికృత మనస్తత్వం, సామాజిక విలువల క్షీణత వంటి కారణాలతో బాలికలపై లైంగిక దాడుల ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరాలు పూర్తిగా తగ్గడం లేదు. చట్టాల భయం కంటే మానవత్వం, కుటుంబ విలువలు, సామాజిక బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఒక్కరి తప్పిదం… కుటుంబానికే మచ్చ…
పోక్సో కేసులో నిందితుడిగా తేలితే కేవలం జైలుశిక్షతోనే విషయం ముగియదు. ఆవ్యక్తి కుటుంబం కూడా సమాజంలో అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామం సైతం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. సమాజంలో గౌరవం కోల్పోవడంతో పాటు కుటుంబ సభ్యులు కూడా అవమానాలకు గురి కావాల్సి వస్తోంది.
పోక్సో కేసుల్లో రాజీకి అవకాశం లేదు..
పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులు అత్యంత సున్నితమైనవిగా పరిగణించబడతాయి. ఒకసారి కేసు నమోదైతే ఇతర సాధారణ కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం ఉండదు. విచారణ అనంతరం నేరం రుజువైతే నిందితులకు కఠిన శిక్షలు విధించబడతాయి. అలాగే బెయిల్ పొందడం కూడా చాలా కష్టమని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు : ఎస్ఐ డి.నరేష్
బాలికలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో)పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు చట్టం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడితే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి.
CLICK HERE TO READ Road Accident | పికప్ వాహనం – ట్రక్కు ఢీకొని.. ఏడుగురు మృతి..
