ఎల్-నినో పరిస్థితులకు పీఎండీఎస్ పద్ధతి ఉత్తమ పరిష్కారం
ఎల్-నినో పరిస్థితులకు పీఎండీఎస్ పద్ధతి ఉత్తమ పరిష్కారం
రామగిరిలో పెల్టైజేషన్ విత్తన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పరిటాల సునీత
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు పెల్టైజేషన్తో కూడిన పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) సాగు విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
రామగిరి మండలంలోని నసనకోట, గంగంపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన పెల్టైజేషన్ పీఎండీఎస్ విత్తన కార్యక్రమంలో కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి నారాయణ నాయక్, సీటీ&ఐఓ, డీపీఎం లక్ష్మా నాయక్‌లతో కలిసి సాగు విధానాన్ని పరిశీలించారు.
నసనకోట గ్రామంలో రైతు శ్రీరాములుకు చెందిన ఐదు ఎకరాల పొలంలో పీఎండీఎస్ సోయింగ్ డెమో నిర్వహించగా, అనంతరం గంగంపల్లిలో రైతు లక్ష్మి పొలంలో మరో ఐదు ఎకరాల్లో విత్తన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆముదం, అనుములు, కందులు, సజ్జలు, అలసందలు, గోరుచిక్కుడు తదితర 25 రకాల జీవ వైవిధ్య విత్తనాలను వినియోగించారు.
బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన అనంతరం బంకమట్టి, ఘన జీవామృతం, బూడిదతో విత్తనాలను పెల్టైజేషన్ చేసి గుళికల రూపంలో తయారు చేశారు. వాటిని ఘన జీవామృతంతో కలిపి పొలాల్లో విత్తడం ద్వారా నేల సారవంతం కావడంతో పాటు తక్కువ వర్షపాత పరిస్థితుల్లోనూ పంటలు నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ సాగు విధానాలపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్పీఎం డాక్టర్ నవీన్, డాక్టర్ నరేంద్ర పర్యవేక్షించారు. ధర్మవరం డివిజన్ ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, ఏడీఏలు, ఏఓలు, ఆర్ఎస్కే సిబ్బంది, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
