అనుచిత సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఇతరులను కించపరిచే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కదిరి టౌన్ పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తిపై బైండ్ ఓవర్ చర్యలు చేపట్టారు.
నల్లచెరువు మండలం ఇందుకూరుపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొండ రామిరెడ్డి (45) సోషల్ మీడియా వేదికల ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అతనికి చట్టపరమైన నోటీసులు జారీ చేసి, కదిరి తహసీల్దార్ సమక్షంలో హాజరుపరిచి ఏడాది కాలానికి రూ.5 లక్షల విలువైన బాండ్‌పై బైండ్ ఓవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో బాధ్యతారహిత పోస్టులు, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేసిన పోలీసులు, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే రౌడీ షీట్ నమోదు చేయడంతో పాటు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
