లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
వైభవంగా ధ్వజారోహణం
భక్తులతో కిటకిటలాడిన దేవాలయం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహో బిలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం అంకురార్పణ సందర్భంగా గరుడపట ధ్వజారోహణం, బలిహరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున దేవాలయంలో స్వామివారికి అభిషేకం, వివిధ పుష్పాలతో, ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి కార్యక్రమా లను నిర్వహించారు.

స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి దేవాలయ ప్రాంగణంలో భాజా భజంత్రీలు నడుమ వారికి ఊరేగించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా విడపనకల్లు మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడా నికి, కర్ణాటక, ఆంధ్ర తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్య లో భక్తులు తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు బొల్లినేని పద్మాక్షి, దబ్బర మాధవి, బోయ రాములమ్మ, కురుబ ఇందిరమ్మ, బోయ ఎర్రమ్మ, చావలి బాయి, మీనుగా రామకృష్ణ, ధనుంజయ ఆచారి, చంద్రమౌళి స్వామి, మంగళ చిన్న నారాయణప్ప, ఇంద్రావతి సుధాకర్, ఓబులేసు, అర్చకులు మయూరం బాలాజీ చార్యులు, గుండురావు తదితరులు పాల్గొన్నారు.
