బాల్య వివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లి…

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : బాల్య వివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనతో పాటు మహిళా సాధికారత, అక్షరాస్యత పెంపు కోసం చేపట్టిన కార్యక్రమాలు విశేష ఫలితాలను సాధించాయని కలెక్టర్ తెలిపారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ కిశోర బాలికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందించడమే ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనమని అన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు లేకుండా బలవంతంగా తీసుకువచ్చే మార్పులు ఎక్కువ కాలం నిలవవని పేర్కొన్నారు. మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని మహిళా సంఘాలలో చదువు రాని మహిళలను ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదు చేసి, 5 వేల మంది వాలంటీర్ల సహకారంతో అక్షరాస్యత బోధించడం జరిగిందన్నారు.
మార్చి నెలలో నిర్వహించిన పరీక్షలకు 34,620 మంది మహిళలు హాజరై 100 శాతం ఉత్తీర్ణత సాధించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. రాబోయే జూలై నెలలో మిగిలిన 35 వేల మంది మహిళలకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, వాలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
మహిళలపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళల భద్రత, గౌరవ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు, స్నేహ కిశోర బాలికల సంఘం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
