Commissioner Ranganath | అభివృద్ధి చేస్తామంటూ చెరువును చెరబట్టారు..
Commissioner Ranganath | అభివృద్ధి చేస్తామంటూ చెరువును చెరబట్టారు..
Commissioner Ranganath | ముష్కిన్’ను ముంచిన ముస్కరులు
సీఎస్‌ఆర్ నిధుల బూచీ.. 34.21 ఎకరాల కబ్జా
హైడ్రా చొరవతో చెరువు సమస్యకు పరిష్కారం
రూ.5500 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్
ప్రభుత్వ భూమి పరిరక్షణలో నిమగ్నమైన హైడ్రా
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ(సీఎస్‌ఆర్) నిధులను బూచీగా చూపి.. చెరువుల అభివృద్ధి మాటున అక్రమాలకు తెగబడిన ముష్కరుల ఆట కట్టించేందుకు హైడ్రా శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించింది… ఓ బడా నిర్మాణ సంస్థ ముసుగులో సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి సాగించేందుకు అనుమతులు పొందడంతో పాటు.. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన చెరువు అభివృద్ధి పనుల వెనుక దాగియున్న కుటిలయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది… ముస్కరులు మింగేందుకు యత్నించిన ముష్కిన్ చెరువును కాపాడటంతో పాటు.. రూ.5500 కోట్ల విలువైన భూమిని కాపాడేందుకు చర్యలకు శ్రీకారం చుట్టింది… శనివారం హైడ్రా టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది… అభివృద్ధి పేరుతో చెరువులను చెరబట్టడమే కాకుండా.. ప్రభుత్వ రికార్డులు.. నిబంధనలకు విరుద్ధంగా చెరువు కట్టలను మార్చి.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారి ఆట కట్టించింది… కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా టాస్క్‌ఫోర్స్ విభాగం శనివారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం.. పుప్పాలగూడ – నార్సింగ్ గ్రామాల పరిధిలో నిర్వహించిన భారీ ఆపరేషన్ ద్వారా ముష్కిన్ చెరువు కబ్జాలకు చెక్ పెట్టడం ద్వారా.. సీఎస్‌ఆర్ నిధుల ముసుగులో చెరువులను దిగమింగిన వారి గుండెల్లో ఆందోళన రేకెత్తించింది…*

Commissioner Ranganath | ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలంలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. పుప్పాలగూడ – నార్సింగ్ గ్రామాల పరిధిలో సర్వే నెంబర్లు 259లో 20.23 ఎకరాలు, సర్వే నెంబర్ 258లో 13.34 ఎకరాలు, సర్వేనెంబర్ 260లో 8.19 ఎకరాలు, సర్వే నెంబర్ 376లో 12.8 ఎకరాల్లో విస్తరించిన ముష్కిన్ చెరువును ముస్కరుల భారి నుంచి కాపాడింది. సీఎస్‌ఆర్ నిధుల మాటున, ముష్కిన్ చెరువును నిండా ముంచిన అక్రమార్కుల చర్యలకు హైడ్రా చెక్ పెట్టింది. చెరువు ఆక్రమణలను గుర్తించిన హైడ్రా, దాదాపు రూ.5500 కోట్ల విలువైన భూమి పరిరక్షించడమే ధ్యేయంగా ఫెన్సింగ్ నిర్మాణాన్ని చేపట్టింది. హెచ్‌ఎండీఏ లెక్కల పకారం 52.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కిన్ చెరువు, గ్రామ రికార్డుల ప్రకారం చెరువు పరిధి 59.11 ఎకరాలుగా ఉండగా, ఇందులో ప్రభుత్వ శిఖం 20.23 ఎకరాలు కాగా, మిగతా అంత ఎక్సాల్ పట్టా ల్యాండ్‌గా హైడ్రా వివరించింది. అయితే హెచ్‌ఎండీఏ రికార్డుల ప్రకారం 52.20 ఎకరాలున్న ఈ చెరువు మధ్య నుంచి కట్టను నిర్మించడం ద్వారా సీఎస్ ఆర్ నిధుల పేరిట అభివృద్ధి ముసుగులో 34.21 ఎకరాలను కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నాలను హైడ్రా తిప్పికొట్టింది. చెరువును అభివృద్ధి పరచి, సుందరీకరణ చేస్తామన్న ముసుగులో ఈ కబ్జాలకు ఓ బడా నిర్మాణ సంస్థ తెరలేపడం గమనార్హం. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా మొత్తం 52.20 ఎకరాల చెరువును కాపాడేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం చెరువును కాపాడుతూ హైడ్రా ఆధ్వర్యంలో శనివారం ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టింది.

అడుగడుగునా నిబంధనలకు నీళ్లు
ముష్కిన్ చెరువు అభివృద్ధి చేపట్టేందుకు ముందుకొచ్చిన ఓ బడా నిర్మాణ సంస్థ , ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి మరీ కబ్జాలకు పాల్పడింది. ప్ర భుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణ పనులను చేపట్టకూడదన్న నిబంధనలను ఉల్లంగించి మరీ ఆక్రమణలకు తెరలేపడంతో పాటు, కోట్ల విలువైన స్థలంలో పేదల పేరిట గుడిసెలు ఏర్పాటు చేయించి, అప్పనంగా కాజేయాలని రియల్టర్లు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే విషయం తెలుసుకున్న హైడ్రా టాస్క్‌ఫోర్స్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆధ్వర్యంలో ఆయా స్థ లాల్లో వేసిన గుడిసెలను ఖాళీ చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడంతో పాటు, రెండు నెలల పాటు వేచి చూశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెలిసిన గుడిసెవాసులంతా స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లి పోయారు. దీంతో శనివారం చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ధారించి, హైడ్రా ఆధ్వర్యంలో సిబ్బంది ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా చెరువు మధ్యలో నిర్మించిన కట్టను తొలగించడంతో పాటు, చెరువు ఎఫ్‌టీఎల్‌తో పాటు మిగిలిన ప్రభుత్వ భూమిని కాపాడే పనిలో హైడ్రా నిమగ్నమైంది.

రూ.3500 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు.?
ఎకరం వంద కోట్ల పైమాటే ఉన్న పుప్పాలగూడ – నార్సింగ్ గ్రామాల్లోని చెరువును చెరబట్టడం ద్వారా బడా నిర్మాణ సంస్థ దాదాపు రూ.3500 కోట్లకు పైగా ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బడా నిర్మాణ సంస్థ ముసుగులో చెరువు అభివృద్ధి చేస్తామని నమ్మబలికి, సగానికి పైగా చెరువును చెరబట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడా నిర్మాణ సంస్థ కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ నిధులతో ఓ స్వచ్ఛంద సంస్థ ముసుగులో పనులను చేపట్టగా, ఆ బడా నిర్మాణ సంస్థ కనుసన్నల్లోనే చెరువు సరిహద్దులను చెరిపేయడం చూస్తుంటే, అక్రమార్కులు ఎంతకు తెగించారో అర్థమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువులను కబ్జా చేసేందుకు, ఈ తరహా విధానాన్నే బడా నిర్మాణ సంస్థ లు అవలంభించాయని వారు ఆరోపిస్తున్నారు.

గ్రేటర్ చెరువులకు సీఎస్‌ఆర్ గండం
హైదరాబాద్ మహా నగరం పరిధిలోని అనేక చెరువులను అభివృద్ధి చేస్తామంటూ పలు కార్పొరేట్ సంస్థ లు గత ప్రభుత్వ హయాంలో జీహెచ్‌ఎంసీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఒప్పందాల వెనుక అభివృద్ధి మంత్రం కన్నా.. కబ్జా తంత్రమే ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు అభివృద్ధి మాటున సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనులతో చెరువులు చిక్కి శల్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయా చెరువుల అసలు లెక్కలు తీసి, అక్రమార్కులు దిగమింగిన భూములను పరిరక్షించాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో సాగుతున్న చెరువుల పరిరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తుండగా, మిగతా చెరువుల అభివృద్ధి మాటున సాగిన పనుల వివరాలను రాబట్టేందుకు హైడ్రా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ(సీఎస్‌ఆర్) పేరిట, చెరువుల సరిహద్దులను మార్చి, ప్రభుత్వ భూములను దిగమింగిన వారికి శనివారం హైడ్రా నిర్వహించిన భారీ ఆపరేషన్ హెచ్చరికగా సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ఆయా చెరువుల చుట్టూ వెలిసిన అక్రమ నిర్మాణాలపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

