వేములవాడలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు..

వేములవాడలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు..
వేములవాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వేములవాడ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఆలయ అధికారులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బద్ది పోచమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చక బృందం ఆశీర్వచనం గావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
