జంగంపల్లి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు.

మంగళవారం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో షబ్బీర్ అలీని కలిసి గ్రామంలోని సమస్యలను వివరించారు. స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సమిష్టిగా పనిచేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలని తెలిపారు. గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్, సొసైటీ అధ్యక్షుడు సిద్ధిరాములు, గ్రామ నాయకులు నర్సింలు, కార్తీక్, బాల నర్సవ్వ, ఆనంద్, రామస్వామి, రమేష్ గౌడ్, నరసింహులు, దుర్గయ్య, అర్చన, లింగం, ప్రవీణ్ గౌడ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.