జీపు జాతను విజయవంతం చేయాలి
కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పిలుపు: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టనున్న జీపు జాతను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు.
మంగళవారం మునుగోడు సీపీఐ కార్యాలయంలో ఈదులకంటి కైలాస్ అధ్యక్షతన నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ప్రశ్నపత్రాల లీకేజీలతో యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం నిరసన తెలిపే విద్యార్థులపై కేసులు నమోదు చేయడం, నిర్బంధ చర్యలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు.
జాతీయ పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 6 నుంచి 14 వరకు జీపు జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 6న మునుగోడు నుంచి జీపు జాత ప్రారంభమవుతుందని, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజా రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోలుగూరి నరసింహ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మహిళా సమాఖ్య కార్యదర్శి మాధగోని సత్యమ్మ, ఉప్పునూతల రమేష్, చల్మెడ సర్పంచ్ బండమీది యాదయ్య, గోస్కొండ లింగయ్య, ఉదయ్ కుమార్, ఆనగంటి నరసింహ, భీమనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
