తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం…
డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రావణ్‌బాబు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలు..
జి.కొండూరు, హెచ్‌బీ కాలనీలో ర్యాలీలు
( జి.కొండూరు ఆంధ్రప్రభ) : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జి.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విజయవాడ హెచ్‌బీ కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్‌బాబు తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. శిశువు జన్మించిన వెంటనే తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం, తల్లిపాల వల్ల శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, రోగనిరోధక శక్తి పెంపు, సరైన పద్ధతిలో తల్లిపాలు అందించే విధానంపై డాక్టర్ శ్రావణ్‌బాబు వివరించారు.
తల్లులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల సందేహాలను నివృత్తి చేసి పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జి.కొండూరు, హెచ్‌బీ కాలనీ ప్రాంతాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఆరోగ్య నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బహిరంగ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి మహేశ్వరరావు, జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారి రేణుక, జి.కొండూరు వైద్యాధికారి డాక్టర్ ఆంజనేయులు, హెచ్‌బీ కాలనీ వైద్యాధికారి డాక్టర్ రాజా, సూపర్‌వైజర్ అపరంజమ్మ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
