నేటి నుంచి పాపికొండల బోటింగ్ నిలిపివేత..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: పాపికొండల పర్యాటక బోటింగ్ సేవలను అధికారులు ఆదివారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై పలు ఆరోపణలు రావడంతో సమగ్ర తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీ టూరిజం నిర్వహిస్తున్న బోట్లతో పాటు 15 ప్రైవేట్ బోట్లను కూడా నిలిపివేశారు. భద్రతా ప్రమాణాల పరిశీలన, తనిఖీలు పూర్తయిన అనంతరం బోటింగ్ సేవలకు మళ్లీ అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నిర్ణయంతో పాపికొండల సందర్శనకు వచ్చే పర్యాటకులు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
