నైరుతి జోరు.. కర్నూలు జిల్లాను తడిపిన భారీ వర్షాలు
నైరుతి జోరు.. కర్నూలు జిల్లాను తడిపిన భారీ వర్షాలు
సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతంతో ఖరీఫ్‌కు శుభసూచకం
ఉప్పొంగిన వాగులు, వంకలు.. పలు ప్రాంతాల్లో నిలిచిన రవాణా
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: నైరుతి రుతుపవనాలు జిల్లాపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతుండటంతో కర్నూలు జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షాలతో జిల్లాలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, రైతుల్లో ఖరీఫ్ సీజన్‌పై కొత్త ఆశలు చిగురించాయి. జూన్ నెలకు సాధారణంగా నమోదు కావాల్సిన వర్షపాతం కంటే ఇప్పటివరకు 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాల పంపిణీ సమానంగా ఉండటంతో రైతులు విత్తనాలు, ఎరువుల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. గత కొన్నేళ్లుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈసారి జూన్ తొలి పక్షంలోనే అనుకూల వర్షాలు కురవడం ఊరటనిస్తోంది. వర్షాలు ఇదే తరహాలో కొనసాగితే జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.
గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామ సమీపంలోని మల్లెల వాగు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించింది. వాగులోకి భారీగా వరదనీరు చేరడంతో గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. పాఠశాల ఆవరణలోకి నీరు చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బైలుప్పల, అగ్రహారం, తెర్నేకల్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నీటమునిగిపోవడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
హాలహర్వి మండలంలో చెరువంక రోడ్డుపై వరదనీరు ప్రవహించడంతో హాలహర్వి-గూళ్యం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గూళ్యం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ నగర్ ఎస్సీ కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఎమ్మిగనూరు మండలంలోని కడివెళ్ల వద్ద కప్పల వంక ఉప్పొంగి ప్రవహించడంతో ఎమ్మిగనూరు-పత్తికొండ ప్రధాన రహదారిపై రాకపోకలు కొంతసేపు స్తంభించాయి. నీటి ప్రవాహం తగ్గిన తర్వాతే వాహనాలను అనుమతించారు.
