పాత ధరల ప్యాకెట్లు… కొత్త ధరల దోపిడీ!

ఖమ్మంలో సిగరెట్ విక్రయాలపై అనుమానాలు
మూడు నెలల తర్వాతా మార్కెట్‌లో పాత ఎంఆర్‌పీ ప్యాకెట్లు
పెంచిన ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు
నిల్వల ఆట.. నకిలీ సిగరెట్ల మాయాజాలమా?
పట్టించుకోని వాణిజ్య పన్నుల శాఖపై విమర్శలు
సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటున్న వినియోగదారులు

ఖమ్మం, జూన్ 3(ఆంధ్రప్రభ) ఖమ్మం జిల్లా కేంద్రంలో సిగరెట్ విక్రయాల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల క్రితం సిగరెట్ కంపెనీలు అనేక బ్రాండ్ల ధరలను పెంచాయి. అయితే ప్రస్తుతం దుకాణాల్లో కనిపిస్తున్న ప్యాకెట్లపై మాత్రం పాత ధరలే ముద్రించి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆశ్చర్యకరంగా ఆ పాత ధరల ప్యాకెట్లను కొత్త ధరలకే విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు అదనపు భారం భరించాల్సి వస్తోంది. ప్యాకెట్‌పై ఒక ధర, విక్రయంలో మరో ధర ఉండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధరల పెంపు తర్వాత కూడా పాత స్టాక్ ఇంత భారీగా ఎలా అందుబాటులో ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలు నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

స్టాక్ నిల్వల వెనుక సిండికేట్ మాఫియా?

సిగరెట్ వ్యాపారంలో కొందరు పెద్ద వ్యాపారులు, డీలర్లు కుమ్మక్కై భారీగా స్టాక్ నిల్వ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరల పెంపు ముందుగానే తెలిసి పెద్ద మొత్తంలో సరుకును గోదాముల్లో దాచిపెట్టారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అదే స్టాక్‌ను పెరిగిన ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మూడు నెలల వ్యవధిలో పాత స్టాక్ చాలా వరకు మార్కెట్ నుంచి మాయమవ్వాలి. కానీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో పాత ఎంఆర్‌పీ ప్యాకెట్లు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది యాదృచ్ఛికమా లేక పక్కా ప్రణాళికతో సాగుతున్న వ్యాపారమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో గోదాముల తనిఖీలు నిర్వహిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

నకిలీ సిగరెట్ల చలామణిపైనా సందేహాలు

పాత ధరలతో ఉన్న ప్యాకెట్లు ఇంకా విస్తృతంగా కనిపించడంతో మరో కోణం కూడా చర్చకు వస్తోంది. మార్కెట్‌లో నకిలీ సిగరెట్లు చలామణి అవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఉత్పత్తులు తయారు చేసి విక్రయించే ముఠాలు దేశంలోని పలు ప్రాంతాల్లో గతంలో బయటపడ్డాయి. అదే తరహా పరిస్థితి ఖమ్మంలోనూ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్యాకెట్లపై ముద్రించిన ధరలు, కోడ్లు, తయారీ వివరాలపై సమగ్ర పరిశీలన అవసరమని వ్యాపార వర్గాలే చెబుతున్నాయి. నకిలీ సిగరెట్లు ఆరోగ్యపరంగా మరింత ప్రమాదకరమనే హెచ్చరికలు ఉన్నాయి. అలాంటి ఉత్పత్తులు మార్కెట్‌లో ఉంటే ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే అధికారులు ఈ కోణాన్ని కూడా విస్మరించకూడదని వినియోగదారులు కోరుతున్నారు.

అధికారుల మౌనం ఎందుకు?

ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ, ఇతర సంబంధిత శాఖలు ఇప్పటివరకు పెద్దగా స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ధరల పెంపు తర్వాత పాత ఎంఆర్‌పీ ప్యాకెట్లు భారీగా మార్కెట్‌లో ఎలా కనిపిస్తున్నాయనే అంశంపై తనిఖీలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వాటిపై చర్యలు తీసుకుంటున్నారా అనే సందేహాలు ఉన్నాయి. మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇదంతా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరల దోపిడీపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సామాన్యులు కోరుతున్నారు. అక్రమ నిల్వలు, పన్ను ఎగవేత, నకిలీ ఉత్పత్తుల కోణాల్లో విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రూ.170 ప్యాకెట్‌కు రూ.250 వసూలు!

మూడు నెలల క్రితం ఒక ప్రముఖ బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ధర రూ.170గా ఉండేది. ప్రస్తుతం అదే బ్రాండ్ ధర రూ.250కు చేరింది. అయితే దుకాణాల్లో ఇంకా రూ.170 ముద్రించిన ప్యాకెట్లే కనిపిస్తున్నాయి. వినియోగదారులు ప్యాకెట్‌పై ఉన్న ధరను చూపించినా విక్రేతలు పెరిగిన ధరలనే వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఒక్కో ప్యాకెట్‌పై భారీ తేడా చెల్లించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు. ప్యాకెట్‌పై ముద్రించిన ధరకు, వసూలు చేస్తున్న ధరకు మధ్య వ్యత్యాసంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఖమ్మం సిగరెట్ మార్కెట్‌లో జరుగుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలికితీయాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది.

Leave a Reply