పాలడుగు ఉపాధి పనుల్లో రక్తపింజర కలకలం..
వైరా, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పాలడుగు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల సమయంలో రక్తపింజర పాము కనిపించడంతో ఉపాధి కూలీల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.శనివారం ఉదయం పనులు నిర్వహిస్తున్న సమయంలో పొదల మధ్య నుంచి పాము బయటకు రావడంతో ఉపాధి కూలీలు అప్రమత్తమై వెంటనే పనులను నిలిపివేశారు.
ఉపాధి కూలీల సమాచారం మేరకు,పాము కొంతసేపు పనుల ప్రదేశం చుట్టూ సంచరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఉపాధి కూలీలు జాగ్రత్తగా పామును పట్టుకొని చంపేయడంతో ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగలేదు.
ఈ సందర్భంగా ఉపాధి పనులకు హాజరైన కూలీలు మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పొదలు,చెట్ల ప్రాంతాల్లో విషపాముల సంచారం పెరుగుతోందని తెలిపారు. పనులు చేపట్టే ముందు సంబంధిత అధికారులు ప్రదేశాలను పరిశీలించి భద్రతా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఘటనతో కొంతసేపు ఉపాధి పనులకు అంతరాయం ఏర్పడగా, పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత పనులను తిరిగి ప్రారంభించారు.ఉపాధి పనుల వద్ద రక్తపింజర పాము కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
