గోదావరి వరదతో మంగపేట ఘాట్‌కు చేరిన నీటి పిల్లులు

మంగపేట, ఆంధ్రప్రభ: గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో ములుగు జిల్లా మంగపేట పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం రెండు నీటి పిల్లులు (ఒటర్లు) కనిపించాయి. వరద నీటి ప్రవాహంలో కొట్టుకువచ్చిన అవి కొద్దిసేపు గోదావరి జలాల్లో సందడి చేస్తూ సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, అక్కడ మనుషులు ఉండడాన్ని గమనించి తిరిగి గోదావరి నీటిలోకి వెళ్లిపోయాయి.

నీటి పిల్లులు సాధారణంగా మనుషులకు ఎలాంటి హాని చేయవని స్థానికులు తెలిపారు. అయితే మత్స్యకారులు గోదావరిలో చేపల కోసం వేసిన వలలను కొరకడంతో పాటు వాటిలో చిక్కిన చేపలను తినడం వల్ల తమకు నష్టం జరుగుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.