మిషన్ భగీరథ పనుల్లో ఎంబీ రికార్డుపై అనుమానాలు..?
- వాస్తవ కొలతలకు.. రికార్డుల్లో నమోదైన వివరాలకు వ్యత్యాసమంటూ చర్చ
- క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నిజాలు తేల్చాలని స్థానికుల డిమాండ్
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండలంలోని ఓ గ్రామంలో చేపట్టిన మిషన్ భగీరథ పైపులైన్ పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (ఎంబీ) రికార్డులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా పైపులైన్ వేసిన పొడవు కంటే ఎక్కువ మీటర్లు ఎంబీ రికార్డుల్లో నమోదు చేసి బిల్లులు పొందారనే ఆరోపణలు మండలంలో చర్చనీయాంశంగా మారాయి. పైపులైన్ పనులు జరిగిన ప్రాంతంలో వాస్తవ కొలతలకు, అధికారిక రికార్డుల్లో నమోదైన వివరాలకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంతన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, పైపులైన్ పనులను క్షేత్రస్థాయిలో మరోసారి కొలవాలని స్థానికులు కోరుతున్నారు. ఎంబీ రికార్డులు, పనుల వివరాలు, చెల్లించిన బిల్లులను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు అధికారిక వివరణ రావాల్సి ఉంది. అధికారులు క్షేత్రస్థాయి తనిఖీ చేపడితే ఎంబీ రికార్డులపై వ్యక్తమవుతున్న అనుమానాలకు తెరపడే అవకాశం ఉంది.
