కడెం ప్రాజెక్టు పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా
కడెం, ఆంధ్రప్రభ: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కడెం ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించిన ఆయన పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం, ప్రస్తుత నీటి నిల్వ, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రాజెక్టు దిగువ ప్రాంత గ్రామాల ప్రజలకు నీటి విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందించి అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లు, నీటి ప్రవాహ ప్రాంతాలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్ అవసరాలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులో నీటి నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పర్యటనలో నీటిపారుదల శాఖ అదిలాబాద్ సీఈ జగదీశ్వర్, నిర్మల్ ఎస్ఈ రాజేంద్ర ప్రసాద్, కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్, డీఈ వీరన్న, కడెం తహశీల్దార్ ఖాజా మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
