రైతులకు కేంద్రం ఊరట..

  • ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా నమోదు గడువు పొడిగింపు..

నరసరావుపేట, ఆంధ్రప్రభ : రైతులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా కురవడం, సాగు పనులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గడువు పొడిగింపుతో ఇప్పటివరకు పంటల బీమా నమోదు చేసుకోని రైతులకు మరో అవకాశం లభించింది. రైతులు తమ సమీపంలోని బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీలు) లేదా అధికారిక పీఎంఎఫ్‌బీవై పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు, కరువు, తుఫాన్లు తదితర కారణాలతో పంటలు దెబ్బతిన్న సందర్భాల్లో అర్హత కలిగిన రైతులకు ఆర్థిక పరిహారం అందించడంలో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

గడువు ముగిసేలోపు రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకుని ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.