ప్ర‌మాద‌క‌రంగా ట్రాన్స్‌ఫార్మ‌ర్లు

కండ్లకోయలో కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్..
బహిరంగంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు
భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్న స్థానికులు
పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు..
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్, గుండ్లపోచంపల్లి డివిజన్‌లోని కండ్లకోయ పద్మశ్రీ ఎంక్లేవ్లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్థానికుల ప్రాణాలకు ముప్పుగా మారిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కాలనీ మధ్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేకపోవడంతో పాటు, విద్యుత్ తీగలు బహిరంగంగా వేలాడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలనీలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ప్రతిరోజూ ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారని, ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ షాక్ ప్రమాదం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలో ఆడుకునే చిన్నారులు, మూగజీవాలు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌కు వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను మరమ్మతు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేదంటే విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.