విత్తనాల నమోదు, సబ్సిడీ కంది విత్తనాలపై రైతులకు అవగాహన

పరకాల, ఆంధ్రప్రభ : వరి విత్తనాల విక్రయాలను పోర్టల్‌లో నమోదు చేసే విధానంపై విత్తన డీలర్లకు పరకాల మండల వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల వరి వంగడాల విత్తనాలను విక్రయించినప్పుడు డీలర్లు తమ లాగిన్ ద్వారా రైతు పట్టాదారు పాస్‌బుక్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేసి, సాగు విస్తీర్ణాన్ని నిర్ధారించి విక్రయించిన వంగడాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాలకు సంబంధించిన బోనస్ రైతులకు అందుతుందని వివరించారు.

అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పథకం కింద వానాకాలం సీజన్‌కు అధిక దిగుబడినిచ్చే ఎల్‌ఆర్‌జీ-133 రకం కంది విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.

ఒక కిలో కంది విత్తన మార్కెట్ ధర రూ.137 కాగా, ప్రభుత్వం రూ.60 సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. దీంతో రైతులు కిలోకు రూ.77 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నాలుగు కిలోల బ్యాగ్ ధర రూ.308గా నిర్ణయించినట్లు వెల్లడించారు.

సబ్సిడీ పొందాలనుకునే రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు వివరాలతో తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. విత్తనాలు పరిమితంగా ఉన్నందున ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని మండల వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్ తెలిపారు.