ఆలయ చందాల వివాదం..
పంచాయతీ కార్యాలయానికి తాళం
చందాల లెక్కలు వెల్లడించాలని గ్రామస్థుల డిమాండ్
కొంతసేపు ఉద్రిక్తత.. పెద్దల జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని ఓ గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ చందాల వ్యవహారం వివాదానికి దారితీసింది. ఆలయానికి సేకరించిన చందాల లెక్కలను గ్రామ ప్రజలకు వెల్లడించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. చందాల వినియోగంపై స్పష్టత లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసనగా గ్రామస్థులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో చర్చించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆలయ చందాల ఆదాయం, వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ ప్రజల ముందుంచి పారదర్శకత పాటించాలని గ్రామస్థులు మరోసారి డిమాండ్ చేశారు.
