గడువులోగా భూసేకరణ పనులు..

గడువులోగా భూసేకరణ పనులు..

  • పట్టాదారు పాసుబుక్స్ పంపిణిపై ప్రత్యేక దృష్టి
  • మ్యుటేషన్, రీసర్వే ప్రక్రియల్లో జాప్యానికి చెక్
  • జాతీయ రహదారులు, రైల్వే పనుల్లో సమన్వయం కీలకం
  • పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారం
  • సెన్సెస్ డేటా సేకరణలో పొరపాట్లకు తావులేకుండా చర్యలు

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణ పనులు, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న పట్టాదారు పాసుబుక్స్ పంపిణీ, మ్యుటేషన్, రీ–సర్వే, పీజీఆర్ఎస్, సెన్సెస్ కార్యక్రమాల్లో జాప్యం లేకుండా సమర్థవంతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులుతో కలిసి జిల్లా కలెక్టర్ వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణ, వైజాగ్–చెన్నై కారిడార్ పైప్‌లైన్ పనులు, ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాజెక్టులు, దుగ్గరాజపట్నం ప్రాజెక్టు, ఏడీబీ రోడ్లు, శ్రీ సిటీ, ఎల్‌జీ ఫేజ్–1,2, స్పేస్ సిటీ ఫేజ్–1,2,3,4, నాయుడుపేట ఫేజ్–2, వానెల్లూరు, పాగలి తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.

భూసేకరణలో జాప్యం వద్దు
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. శ్రీ సిటీ, ఏపీఐఐసీ పరిధిలోని ఎల్‌జీ ఫేజ్–1,2,3, కొల్లాడం, ఇరుగుళం, పెద్దేటిపాకం, రాళ్లకుప్పం, నాయుడుపేట ఫేజ్–2, వానెల్లూరు, పాగలి ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వెబ్‌ల్యాండ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భూసంబంధిత సేవల్లో పారదర్శకత ఉండాలని, రైతులు లేదా భూయజమానులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

సమన్వయంతో పనిచేయాలి
జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనుల్లో సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వైజాగ్–చెన్నై కారిడార్ పైప్‌లైన్ పనులు, నడికుడి–శ్రీకాళహస్తి, ఏర్పేడు–పూడి, గుమ్మడిపూండి–గూడూరు, గూడూరు–రేణిగుంట, తిరుపతి–కాట్పాడి, అర్కొణం–రేణిగుంట రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే నాయుడుపేట–రేణిగుంట, రేణిగుంట–కడప, రేణిగుంట–చెన్నై జాతీయ రహదారి విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగరమాల పథకం కింద చేపడుతున్న ప్యాకేజీ–2,3,4 జాతీయ రహదారి పనులు నాణ్యతతో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

గడువులోగా పూర్తి
రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయం చేసుకుని పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, జలవనరుల శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనిచేసి పెండింగ్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏపీఐఐసీ ప్యాకేజీ–5, ఏడీబీ రోడ్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుబుక్స్ పంపిణిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన రైతులకు పాసుబుక్స్ అందజేయడంలో ఆలస్యం జరగకుండా చూడాలని తెలిపారు. మ్యుటేషన్ దరఖాస్తులను నిర్దేశిత గడువులో పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. రీ–సర్వే కార్యక్రమంలో గ్రామస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రాధాన్యంతో పరిష్కారం
భూసరిహద్దుల నిర్ధారణ, రికార్డుల సవరణ, సాంకేతిక అంశాలపై క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భూసేకరణ కేసుల్లో రైతులు, భూయజమానులతో సమన్వయం పాటిస్తూ చట్టపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని, పరిహారం చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సెన్సెస్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా సిబ్బందికి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు
స్వీయ గణన, గృహ గణన కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రతి అంశంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజూ పనుల పురోగతిని సమీక్షిస్తూ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోజ్‌మాండ్, ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, లీగల్ అడ్వైజర్ భాను, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, భూసేకరణ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.