టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : వేసవి సెలవులు వచ్చాయంటే చాలు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు ప్రయాణమవుతారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఈ పనుల్లో తలమునకలైంది. సుమారు రూ.2 కోట్లను ఇందుకోసం వెచ్చిస్తున్నారు. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్రింగ్ రోడ్డు వరకు చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చేలా షెల్టర్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్ లో వేచివుండే భక్తులకు చల్లదనం కోసం కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాలలో చలువ పందిళ్ళ నిర్మాణం చేపట్టారు. నాలుగు మాడవీధుల్లో సింథటిక్ ఎనామిల్కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేలవేడి నుంచి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. బాటగంగమ్మ గుడి సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఆరోగ్య విభాగం ప్రత్యేక ఏర్పాట్లు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వేసవినేపథ్యంలో భక్తులు తాగునీటికి ఇబ్బంది పడకుండా శ్రీవారి సేవకులు నేరుగా భక్తుల వద్దకే వెళ్లి తాగునీరు అందిస్తున్నారు.
ఒక బ్యాచ్లో 15 మంది వంతున మొత్తం మూడు బ్యాచ్లలో రోజుకు 45 మంది శ్రీవారి సేవకులు భక్తులకు తాగునీరు అందిస్తున్నారు. దర్శన క్యూలైన్లలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో భక్తులకు అవసరమైన తక్షణ వైద్య సేవలు అందిస్తారు. రద్దీకి అనుగుణంగా ఔటర్రింగ్ రోడ్డులో క్యూలైన్ల వెంబడి ఒక మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అందుబాటులో ఉంచారు. నారాయణగిరి వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. వేసవి రద్దీకి తగిన విధంగా భక్తులకు స్వామివారి లడ్డూలను విరివిగా అందుబాటులో ఉంచుతున్నారు.
సాధారణ రోజుల్లో 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచగా పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను బఫర్గా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 60 వేలమంది భక్తులకు మించి తిరుమలలో వసతి కేటాయించే అవకాశం లేదు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 యాత్రికుల వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులు తిరుమలలోని పిఏసి-1, పిఏసి-2, పిఏసి-3, పిఏసి-5 లలో దాదాపు 9 వేల లాకర్లను వినియోగించుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఎక్కువమంది ఉండే భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు వీలుగా ఒంటరిగా వచ్చే వారికి వసతి గదులు కేటాయించడం లేదు.
తలనీలాల సమర్పణకు ఇబ్బంది లేకుండా.. తిరుమలలో భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో ప్రధాన కళ్యాణకట్టతో పాటు పిఏసి-1, పిఏసి-2, పిఏసి-3, పిఏసి-5, జిఎన్సి, హెచ్ఐసి, సప్తగిరి విశ్రాంతిగృహం, నందకం, కౌస్తుభం, శ్రీవేంకటేశ్వర విశ్రాంతిగృహం, శ్రీపద్మావతి విశ్రాంతిగృహం ప్రాంతాలలో 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. టీటీడీలో మొత్తం 1152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళలు ఉన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా అదనపు సౌకర్యాలపై దృష్టి సారించింది.
