TTD | శ్రీవారి దర్శనం పేరుతో మోసం..
TTD | శ్రీవారి దర్శనం పేరుతో మోసం..
- మాజీ టీటీడీ ఉద్యోగితో పాటు మరో వ్యక్తి అరెస్ట్
తిరుమల, ఆంధ్రప్రభ : శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, ప్రత్యేక సేవలు, వసతి సదుపాయాలు ఇప్పిస్తామని అమాయక భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు మోసగాళ్లను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.11,800 నగదు, రెండు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో మాలే శంకరయ్య (47) గతంలో టీటీడీలో మజ్దూర్‌గా పనిచేసి అనంతరం విధుల నుంచి తొలగించబడిన వ్యక్తి కాగా, మరో నిందితుడు మూడే వెంకటరమణ నాయక్ (48), అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కోళ్ళఫారం గ్రామానికి చెందినవాడు.
పోలీసుల విచారణలో నిందితులు శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, అర్చన సేవ, తోమాల సేవలతో పాటు వసతి సదుపాయాలు కల్పిస్తామని భక్తులను నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. విజయవాడకు చెందిన మల్లికార్జునరావు, ఆయన కుటుంబ సభ్యులకు శ్రీవాణి టిక్కెట్లు, వసతి ఏర్పాటు చేస్తామని చెప్పి రూ.51,800 తీసుకుని ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, జూన్ 3న తిరుమల ముళ్లగుంట కార్ పార్కింగ్ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, నేర చరిత్రను పరిగణనలోకి తీసుకున్న కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ప్రధాన నిందితుడు మాలే శంకరయ్య తన మొబైల్ ద్వారా భక్తులను సంప్రదిస్తూ తాను టీటీడీ ఉద్యోగినని పరిచయం చేసుకుని దర్శనం, వసతి సదుపాయాలు కల్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భక్తులు తిరుమలకు వచ్చిన తర్వాత అతడిని సంప్రదిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయేవాడని వెల్లడైంది. గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి మూడు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో తేలింది.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం, వసతి, ప్రత్యేక సేవలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులు లేదా అనధికార ఏజెంట్ల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, ప్రత్యేక సేవలు, వసతి బుకింగ్‌ల కోసం కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్, అధికారిక వేదికలను మాత్రమే వినియోగించాలని తెలిపారు.
అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే వ్యక్తులపై తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన నిఘా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ, శ్రీవారి దర్శన టిక్కెట్లు, ప్రత్యేక సేవలు, వసతి పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై విజిలెన్స్, పోలీసు శాఖలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండి అనధికార వ్యక్తులను నమ్మరాదని సూచించారు.
